
తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక సచివాలయంగా ఉన్న బీఆర్‌కె (బూర్గుల రామకృష్ణారావు)భవన్‌లోకి కరోనా మహమ్మారి ప్రవేశించింది. ఏడవ అంతస్తులోని ఆర్ధికశాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో కొందరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవడంతో ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు అందరినీ హోం క్వారెంటైన్‌లో ఉండవలసిందిగా వైద్య అధికారులు సూచించారు. అదే భవనంలో 8వ అంతస్తులలో పనిచేస్తున్న ఆర్ధికశాఖ ఉద్యోగులు నేడు విధులకు హాజరుకాలేదు. బీఆర్‌కె భవన్‌లోనే ఇంకా అనేక శాఖల ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కనుక ప్రతీరోజు ఉద్యోగులు, అధికారులు అందరికీ ధర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకొన్న తరువాతే లోపలకు అనుమతిస్తున్నారు. అయినా కూడా కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మిగిలిన ఉద్యోగులు ఆందోళనచెందుతున్నారు.