తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు?

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనం చేస్తామని సిఎం కేసీఆర్‌ స్వయంగా అనేకసార్లు చెప్పారు. దానిలో భాగంగా వీఆర్వో (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) వ్యవస్థ రద్దును చేయబోతున్నట్లు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. శుక్రవారం జనగామ జిల్లాలో మంచుప్పల గ్రామంలో నియంత్రితసాగు అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, “రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో వీఆర్వో వ్యవస్థ ఏర్పడింది కానీ దాని వలనే రైతులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రైతుల భూముల రికార్డులు, పాసు పుస్తకాల పంపిణీ విషయంలో రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ విఫలమైందని భావిస్తున్నాము. కనుక ఆ వ్యవస్థను రద్దు చేసి రైతులకు మేలు కలిగించే విధంగా అవసరమైన యంత్రాంగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది,” అని అన్నారు. 

వీఆర్వో వ్యవస్థలో కొందరు అవినీతిపరుల కారణంగా చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. అటువంటివారిని గుర్తించి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. కానీ కొందరి అవినీతిపరుల కారణంగా మొత్తం వీఆర్వో వ్యవస్థనే రద్దు చేసినట్లయితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. వీఆర్వోలందరికీ ప్రత్యామ్నాయంగా ఉద్యోగాలలోకి తీసుకోకుండా రద్దు చేసినట్లయితే వారందరూ హైకోర్టును ఆశ్రయించడం ఖాయం. వీఆర్వో వ్యవస్థకు ప్రత్యామ్నాయ యంత్రాంగం సిద్దం చేయకుండా రద్దు చేసినట్లయితే రైతులు చాలా ఇబ్బంది పడతారు. కనుక మంత్రి ఎర్రబెల్లి చెప్పినట్లు ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థ రద్దు చేయదలిస్తే చాలా ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది.