జూన్ 1 నుంచి 200 రైళ్లు ప్రారంభం

జూన్ 1వ తేదీ నుంచి మరో 200 రైళ్లు ప్రారంభం కానున్నాయి. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా ఈ విషయం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అయితే ఇవన్నీ నాన్-ఏసీ రైళ్ళేనని తెలిపారు. త్వరలోనే వీటి టైమ్-టేబిల్ ప్రకటించి ఆన్‌లైన్‌ రిజర్వేషన్లకు బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం డిల్లీ-దేశంలో కొన్ని ప్రధాన నగరాల మద్య 15 జతల రైళ్లు తిరుగుతున్న సంగతి తెలిసిందే. వాటికి అదనంగా ఈ రైళ్లు ఉండవచ్చు. 



మార్చి 24న హటాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అప్పటి నుంచి రైళ్ళు నిలిచిపోయాయి. దాంతో వివిద పనులు నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినవారు అక్కడే చిక్కుకుపోయారు. అలాగే అత్యవసర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసినవారు రైళ్ళు రద్దవడంతో తమ ప్రయాణాలను వాయిదా వేసుకోకతప్పలేదు. అప్పటి నుంచి అందరూ రైళ్ళు ఎప్పుడు ప్రారంభం అవుతాయా...అని ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఇన్నాళ్లకు రైళ్ళు ప్రారంభం అవుతుండటం చాలా సంతోషకరమైన విషయమే. అయితే కరోనా వైరస్‌ సర్వత్రా వ్యాపించి ఉన్న నేపధ్యంలో అత్యవసరమైతే తప్ప రైలు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరిన తరువాత వారిని 14 రోజులు క్వారెంటైన్‌లో ఉంచే అవకాశం కూడా ఉంది కనుక అందుకు సిద్దపడితేనే రైలు ఎక్కడం మంచిది.