వలస కార్మికులు, శవాలు ఒకే ట్రక్కులో రవాణా!

ఇటీవల యూపీలో రోడ్డు ప్రమాదంలో 23 మంది వలస కార్మికులు చనిపోయిన సంగతి తెలిసిందే. అత్యంత దీనావస్థలో ఉన్న వలస కార్మికులు ఓ ట్రక్కులో తమ స్వస్థలాలకు తిరిగి వెళుతుంటే దారిలో ప్రమాదంలో మరణించడం చూసి యావత్ దేశప్రజలు బాధపడ్డారు. అంతకంటే దారుణం ఏమిటంటే, ఆ ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను,ఆ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన 33 మందిని ఒకే ట్రక్కులో యూపీ పోలీసులు వారి స్వస్థలాలకు పంపించారు. 

మృతదేహాలను వేరేగా అంబులెన్సులో ఫ్రీజర్ బాక్సులో ఉంచి పంపించవలసి ఉండగా వాటిపై పాలిథిన్ కవర్లు కప్పి అదే ట్రక్కులో పంపించారు. ఆ మృతదేహాల నుంచి విపరీతమైన దుర్వాసన వెలువడుతుంటే, వలస కార్మికులు ఆ శవాల పక్కనే కూర్చొని సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణించి యూపీలో ప్రయాగ్‌రాజ్‌ నగరం చేరుకొన్నారు. 

ఆ ట్రక్కులో ఉన్న ఓ వలస కార్మికుడు తమ దయనీయ పరిస్థితిని తెలియజేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ యూపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అప్రమత్తమైన ప్రయాగ్‌రాజ్‌లో యూపీ అధికారులు హడావుడిగా ఆ ట్రక్కును వెతికి పట్టుకొని దానిలో గాయపడి ఉన్న వలస కార్మికులను వేరే బస్సులో, మృతదేహాలను అంబులెన్సులలో వారి స్వస్థలాలకు తరలించారు.