సిఎం కేసీఆర్‌ తాజా ప్రెస్‌మీట్‌... వివరాలు

ఈరోజు మంత్రివర్గ సమావేశం తరువాత సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించి మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు తెలియజేశారు. ఆ వివరాలు క్లుప్తంగా...

హైదరాబాద్‌లోని కంటెయిన్మెంట్ జోన్లు తప్ప రాష్ట్రంలో అన్ని జిల్లాలు గ్రీన్‌జోన్‌గా గుర్తింపు. 

కనుక కంటెయిన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని రకాల దుకాణాలు, హోటల్స్, పరిశ్రమలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ 100 శాతం నడిపించుకోవచ్చు. ఎటువంటి ఆంక్షలు, నిషేధాలు ఉండవు.  

కంటెయిన్మెంట్ జోన్లు మినహా హైదరాబాద్‌ నగరంలో కూడా అన్ని రకాల దుకాణాలు ‘సరి బేసి’ పద్దతిలో నడిపించుకోవచ్చు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఐ‌టి కంపెనీలు, పరిశ్రమలు నడిపించుకోవచ్చు. 

రేపు ఉదయం 6 గంటల నుంచి సిటీ బస్సులు తప్ప రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. అయితే రాష్ట్రంలోనే జిల్లాల మద్యనే తిరుగుతాయి తప్ప ఇతర రాష్ట్రాలకు వెళ్ళవు. ఇతర రాష్ట్రాల బస్సులను రాష్ట్రంలోకి అనుమతించబడవు. బస్సులలో కరోనా జాగ్రతలన్నీ పాటించబడతాయి. 

కంటెయిన్మెంట్ జోన్లు తప్ప హైదరాబాద్‌ నగరంతో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఆటోలు, టాక్సీలు నడిపించుకోవచ్చు. టాక్సీలలో డ్రైవరుతో కలిపి నలుగురు, ఆటోలలో డ్రైవరుతో కలిపి ముగ్గురిని మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబందనను ఉల్లంఘించినవారిపై కటిన చర్యలు తీసుకోబడతాయి. 

ప్రజలందరూ విధిగా మొహానికి మాస్క్ లేదా రుమాలు ధరించి మాత్రమే బయటకు రావాలి. లేకుండా వస్తే రూ.1,000 జరిమానా విధించబడుతుంది. 

కంటెయిన్మెంట్ జోన్లు తప్ప హైదరాబాద్‌ నగరంతో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలు, ప్రాంతాలలో ఈ కామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. సరఫరా చేయవచ్చు. 

కంటెయిన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ ఆంక్షలు, నిషేదాలు యధాతధంగా కొనసాగుతాయి. ఆ జోన్ల నివశిస్తున్న 1,452 కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులు, మందులు వగైరా అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. 

లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తిగా సడలించబడ్డాయి కదా అని ప్రజలు అవసరం లేకుండా రోడ్లపైకి రావద్దని సిఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. దాని వలన కరోనా మళ్ళీ పెరిగితే మళ్ళీ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలుచేయవలసి వస్తుందని హెచ్చరించారు. కనుక ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.    

అన్ని మతాల ప్రార్ధనా మందిరాలు, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్, వ్యాయామశాలలు, స్విమ్మింగ్ ఫూల్స్, పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై నిషేదం యదాతధంగా కొనసాగుతుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు వాటిని తెరవకూడదు. 

మత సమావేశాలు, సామూహిక ప్రార్ధనలు, రాజకీయ సభలు, సమావేశాలు వగైరా అన్నిటిపై నిషేధం యదాతధంగా కొనసాగుతుంది.