తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ సేవలు షురూ?

లాక్‌డౌన్‌తో గత రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన తెలంగాణలోని ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి రోడ్లపైకి రానున్నాయి. రాష్ట్రంలో కంటెయిన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. అయితే హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సులు తిప్పకపోవచ్చునని తెలుస్తోంది. మొదట హైదరాబాద్‌ నుంచి దూరప్రాంతాల సర్వీసులు ప్రారంభించనున్నారు. మహబూబ్‌నగర్‌ వైపు వెళ్ళే బస్సులు ఆరాంఘర్ డిపో నుంచి, వరంగల్ వైపు వైపు వెళ్ళే బస్సులు ఎల్బీ నగర్ డిపో నుంచి బయలుదేరుతాయని సమాచారం. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుళ్ళన్నీ నేరుగా జూబ్లీ బస్ స్టేషన్‌కు చేరుకొనేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులకు కూడా బస్సులు బయలుదేరే ముందు, దిగిన తరువాత కూడా డిపోలలో ధర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. బస్సులలో కరోనా వ్యాపించకుండా సామాజిక దూరం పాటించవలసి ఉంటుంది కనుక బస్సు సామార్ధ్యంలో సగం మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాని వలన ఆర్టీసీ చాలా నష్టపోతుంది కనుక ఆ మేరకు టికెట్ ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసి సిఎం కేసీఆర్‌ ముందు ఉంచబోతున్నట్లు తాజా సమాచారం. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో సిఎం కేసీఆర్‌ ఈ అంశంపై మంత్రులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తారు.