తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి

కరోనా భయంతో గత రెండు నెలలుగా రాష్ట్రంలో మూతబడిన ప్రైవేట్ ఆసుపత్రులను తెరిచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కరోనాకు చికిత్స అందించేందుకు అనుమతించింది. 

రాష్ట్రంలో ప్రైవేట్ వైద్య సేవలను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. 1. ప్రైవేట్ క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు. 2. ఇన్-పేషంట్‌ లేని నర్శింగ్ హోంలు, 3. ఐసీయూ, వెంటిలేటర్ సౌకర్యం కలిగిన ఆసుపత్రులు. 

1. ప్రైవేట్ క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు: వైద్యులు, సిబ్బంది అందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ గంటకు నలుగురు పేషంట్‌లను మాత్రమే చూడాలి. కరోనా లక్షణాలున్నవారిని గుర్తిస్తే వెంటనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలకు వారి సమాచారాన్ని అందించి, వారిని కరోనా ఆసుపత్రులకు పంపించేందుకు సహకరించాలి. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి టెలీ-మెడిసన్ (ఫోన్, వీడియో ఫోన్‌ ద్వారా) రోగులకు వైద్య సేవలు అందించవచ్చు. 

2. పైనా పేర్కొన్న నిబందనలే ప్రైవేట్ నర్శింగ్ హోంలకు కూడా వర్తిస్తాయి. 

3.కరోనా రోగులకు చికిత్స అందించే ఆసుపత్రులలో కరోనా ఇతరులకు సోకకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి, ఆసుపత్రికి వచ్చే ఇతర రోగులకు కరోనా సోకకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా రోగులకు, సాధారణ రోగుల రాకపోకలకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలి. 

కరోనా లక్షణాలున్నవారు వస్తే ముందుగా వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపాలి. కరోనా లేదని నిర్ధారణ అయ్యేవరకు ఐసోలేషన్ వార్డులోనే ఉంచాలి. సంబంధిత నిపుణుల వైద్య బృందం అన్నీ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స చేయవచ్చు.

ఎప్పటికప్పుడు కరోనా రోగులకు చేస్తున్న వైద్య చికిత్స వివరాలను రికార్డ్ చేస్తూ, వారి వివరాలను జిల్లా వైద్యాధికారికి తెలియజేస్తుండాలి.

ఒకవేళ ఇతర ఆరోగ్య సమస్యలతో ఎవరైనా చనిపోతే ఆ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. 

ఒకవేళ కరోనాతో ఎవరైనా మృతి చెందినట్లయితే, మృతదేహాలను ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం డిస్పోజ్ చేయాలి. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బోధనాసుపత్రులలో, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రులలో జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలతో వచ్చే రోగులకు ఇకపై ప్రత్యేకంగా వేరే వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.