
ఉమ్మడి శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ జిల్లాలకు రోజుకు 3 టీఎంసీలు నీళ్ళు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం చేపట్టాలని నిర్ణయించింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిందివిభజన చట్టంలో 11వ షెడ్యూల్ ప్రకారం కృష్ణా, గోదావరి నదులపై ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టాలన్నా ముందుగా సంబందిత బోర్డుకు, ఆపెక్స్ కౌన్సిల్‌కు తెలియజేసి అనుమతి పొందవలసి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. . తెలంగాణ ప్రభుత్వం పిర్యాదును స్వీకరించిన కృష్ణా బోర్డు దానిపై వివరణ కోరుతూ ఏపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుపై ఏపీ ప్రభుత్వం ఇంకా స్పందించవలసి ఉంది.
అయితే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డితో సహా పలు ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపట్టిందని, కానీ తాము శ్రీశైలం రిజర్వాయరులో వరద సమయంలో ఉండే మిగులు జలాలను మాత్రమే వినియోగించుకోవాలనుకొంటున్నామని, దానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.