
సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యి రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వస్తున్న తెలంగాణ ప్రజలు, వలస కార్మికుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. అందరినీ తప్పనిసరిగా క్వారెంటైన్ కేంద్రాలకు తరలించి కరోనా లక్షణాలు కనబడినవారికి వైద్య పరీక్షలు చేయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళేవారిని విమానాశ్రయం నుంచే నేరుగా ప్రత్యేక బస్సులలో వారివారి రాష్ట్రాలకు తరలించాలని సూచించారు. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్ళీ పరిస్థితి మొదటికొస్తుందని కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్ నాలుగు జోన్లలోనే కరోనా కేసులు బయటపడుతున్నాయి తప్ప రాష్ట్రంలో మరెక్కడా కొత్తగా కరోనా కేసులు బయటపడటం లేదు కనుక నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఆటోమోబైల్ షో రూములు, ఆటోమోబైల్ స్పేర్ పార్టులు, ఫ్రిజ్జులు, ఏసీలు అమ్మే దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.
దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ రేపటితో ముగుస్తుంది కనుక దానిపై కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించిన తరువాత దానిని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏవిధంగా మునుదుకు సాగాలో నిర్ణయించుదామని సిఎం కేసీఆర్ అన్నారు.
జూన్ 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హరితహారం చేపట్టేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.