.jpg)
ఏపీలో జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇరువురు ముఖ్యమంత్రుల మద్య సఖ్యత ఏర్పడటంతో ఆరేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కొన్ని విభజన సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకొన్నారు. ఆ తరువాత రెండు రాష్ట్రాలు కలిసి కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసేందుకు సిద్దపడ్డాయి కానీ దాని వలన ఏపీకి పెద్దగా ప్రయోజనం ఉండదని భావించిన ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. అప్పటి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల మద్య మళ్ళీ దూరం పెరగడం మొదలైంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోసుకొనేందుకు రాయలసీమ ప్రాజెక్ట్ నిర్మాణానికి జీవో జారీ చేయడంతో సిఎం కేసీఆర్ భగ్గుమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ఆ ప్రాజెక్టును అడ్డుకొంటామని చెప్పడమే కాక అప్పుడే కృష్ణా నీటి యాజమాన్య నిర్వహణ బోర్డుకు ఫిర్యాదు చేశారు.
దీనిపై ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా తీవ్రంగానే స్పందించారు. జగన్ మంగళవారం తాడేపల్లిలో తన క్యాంప్ కార్యాలయంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకొన్నారు. రాయలసీమ జిల్లాలలో ప్రజలు త్రాగునీరు కూడా లేక విలవిలలాడుతున్నారు. వారికి త్రాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రాజెక్టు కట్టాలనుకొంటున్నాము. కనుక దీనిపై మానవత్వంతో ఆలోచించాలి తప్ప రాజకీయాలు చేయడం సరికాదు. అయినా కృష్ణా బోర్డు నిర్దేశించిన మేరకు మానవాటాగా వచ్చే నీళ్ళనే మనం వాడుకొంటాము తప్ప అదనంగా ఒక్క చుక్క కూడా మనకు అవసరం లేదు.
శ్రీశైలంలో 800 అడుగుల ఎత్తు నీరు నిలువ ఉన్నప్పుడే తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి రోజుకు (2 టీఎంసీలు), కల్వకుర్తి (0.3 టీఎంసీలు), ఎస్‌ఎల్‌బీసీ ద్వారా (0.51 టీఎంసీలు) నీళ్ళు తరలించుకొంటోంది. ఇవికాక జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ల ద్వారా శ్రీశైలం జలాశయంలోకి నీళ్ళు రాకముందే తరలించుకొంటోంది.
కానీ మనం శ్రీశైలంలో 854 అడుగులకు నీరు చేరినా పోతిరెడ్డిపాడు ద్వారా 7,000 క్యూసెక్కులు తరలించడమే కష్టమవుతోంది. శ్రీశైలంలో 881 అడుగులకు నీరు చేరిన తరువాత సముద్రంలోకి విడిచిపెట్టే మిగులుజలాలను ఉపయోగించుకొనేందుకు ప్రాజెక్టు కట్టుకొంటామంటే ఎవరికైనా అభ్యంతరం ఎందుకు?ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు కేటాయించాలో, దానిలో ఎన్ని నీళ్ళు వాడుకొంటున్నాయో కృష్ణా ట్రిబ్యూనల్ చూసుకొంటుంది. కనుక దీనిపై అనవసరమైన రాజకీయాలు చేయడం సరికాదు,” అని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మద్య కొత్తగా మొదలైన ఈ జలజగడంపై చర్చించి పరిష్కరించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నేడు సమావేశం కాబోతోంది.