మన కాళ్లపై నిలబడదాం: ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “కరోనా మనకు అనేక కొత్త పాఠాలు నేర్పింది. దానిలో ఒకటి...మన కాళ్ళ మీద మనం నిలబడాలని! గత ఆరేళ్లుగా కేంద్రప్రభుత్వం ఆ దిశలోనే పనిచేస్తున్నందునే ఈ సంక్షోభాన్ని కూడా తట్టుకోగలుగుతున్నాము. ముఖ్యంగా ఎక్కడికక్కడ స్థానికంగా ఉత్పత్తి, సరఫరా, వినియోగ వ్యవస్థలను మనం బలోపేతం చేసుకోవలసి ఉంది. కనుక దీనిపై అందరూ దృష్టిపెట్టవలసిందిగా కోరుతున్నాను.     

కరోనా నేపధ్యంలో ఇకపై మనం మరింత స్వయం సమృద్ధి సాధించవలసిన అవసరం ఉంది. అప్పుడే భవిష్యత్‌లో ఇటువంటి ఉపద్రవాలు వచ్చినా మనం తట్టుకోగలుగుతాము. కనుక దేశం అన్ని రంగాలు, వ్యవస్థలలో స్వయంసమృద్ధి సాధించేందుకుగాను రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ రూపొందించాము. ఆ వివరాలను ఆర్ధిక మంత్రి రేపటి నుంచి స్వయంగా వివరిస్తారు. 

ఇంతకు ముందు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన రూ.4.25 లక్షల కోట్ల ప్యాకేజీ, అలాగే గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద ఆర్ధిక మంత్రి ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీలు కూడా ఈ కొత్త ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి,” అని చెప్పారు. 

ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీతో నేటి నుంచి షేర్ మార్కెట్స్ లో మళ్ళీ నూతనోత్సాహం కలుగుతుంది కనుక నేటి నుంచి మళ్ళీ కొన్ని రోజుల వరకు లాభాలబాటలో పయనించే అవకాశం ఉంది.