నాకేమీ కాలేదు బాగానే ఉన్నా: కేటీఆర్‌

మంత్రి కేటీఆర్‌ సోమవారం సిరిసిల్లలో పర్యటిస్తుండగా జలుబుతో బాధపడుతున్నట్లు కనిపించారు. దాంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలైపోయాయి. దాంతో ఓ వ్యక్తి ఆయన ఆరోగ్యం గురించి ట్విట్టర్‌లో ప్రశ్నించగా, కేటీఆర్‌ వెంటనే సమాధానం చెప్పారు. “అలర్జీ కారణంగా నాకు అప్పుడప్పుడు జలుబు చేస్తుంటుంది. ఇది అనేక సంవత్సరాలుగా ఉన్నదే. జలుబు కారణంగా సిరిసిల్లాలో నేను పాల్గొనవలసిన కార్యక్రమంలో హాజరుకాకపోతే అక్కడివారు ఇబ్బందిపడతారనే ఉద్దేశ్యంతోనే నేను హాజరయ్యాను. ఆ సందర్భంగా నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. కానీ నాకేమీ కాలేదు. బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి శ్రద్ద కనబరిచిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని ఆయన ట్వీట్ చేశారు.         

ఒకప్పుడు జలుబు, దగ్గు, జ్వరం వస్తే ఎవరూ పెద్దగా పట్టించుకొనేవారు కారు. కానీ కరోనా పుణ్యమాని ఇప్పుడు ఆ లక్షణాలు కనిపిస్తే  వైద్యులు సైతం చికిత్స చేయడానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కనుక కేటీఆర్‌ గురించి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందడంలో ఆశ్చర్యం లేదు.