ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ నేడు సమావేశం

ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశం కానున్నారు. మరో ఆరు రోజులలో లాక్‌డౌన్‌ గడువు ముగియనున్నందున మళ్ళీ లాక్‌డౌన్‌ పొడిగించాలా వద్దా? ఒకవేళ పాక్షిక లాక్‌డౌన్‌ పాటించదలిస్తే ఏఏ రంగాలకు ఆంక్షల నుంచి మినహాయింపులు ఇవ్వాలి? లాక్‌డౌన్‌ తరువాత కరోనా వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు, వ్యయవసాయం, పరిశ్రమలు, వాణిజ్యసంస్థలు మొదలైనవాటి గురించి నేటి సమావేశంలో ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉంది. అలాగే రైల్వే, రోడ్డు రవాణా, మెట్రో, విమాన తదితర ప్రజారవాణా వ్యవస్థలను ఎప్పటి నుంచి ఏవిధంగా ప్రారంభించాలి? వంటి అనేక అంశాలపై కూడా ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు తీసుకొని తదనుగుణంగా కేంద్రప్రభుత్వం కార్యాచరణను ప్రకటిస్తుంది. 

లాక్‌డౌన్‌ కారణంగా కరోనా అదుపులో ఉన్నప్పటికీ, నానాటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే కరోనా మరింత వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. కానీ ఇంకా లాక్‌డౌన్‌ కొనసాగిస్తే దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. కోట్లాదిమంది పేదలు ఆకలితో అలమటించే ప్రమాదం కూడా ఉంటుంది కనుక కరోనా వ్యాప్తిని అడ్డుకొంటూనే అన్ని వ్యవస్థలను పూర్తి స్థాయిలో నడిపించవలసి ఉంది. జనసమూహాలు ఎక్కువగా ఉండే చోటే కరోనా వ్యాపిస్తుంటుంది కనుక షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్, స్కూళ్ళు, కాలేజీలపై మరికొంత కాలం ఆంక్షలు కొనసాగిస్తూ మిగిలిన అన్ని రంగాలను ప్రత్యేక ఆంక్షలు, నిబందనలతో అనుమతించవచ్చు. ఉదాహరణకు రేపు డిల్లీ నుంచి ప్రారంభం కాబోతున్న 15 జతల ప్రత్యేక రైల్ సర్వీసులకు ప్రత్యేక నియమనిబందనలు అమలుచేస్తున్నారు. అదేవిధంగా వివిద రంగాలకు వాటికి తగ్గట్లుగా వేర్వేరు నియమనిబందనలు అమలుచేయకతప్పదు.