
ఏపీలో మందుబాబులకు మద్యం దుకాణాలు తెరిచారనే సంతోషం లేకుండా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నెలన్నర రోజుల తరువాత ఏపీలో సోమవారం మద్యం దుకాణాలు తెరిచినప్పుడే 25 శాతం అధికధరలు నిర్ణయించి ఫస్ట్ షాక్ ఇచ్చింది. అయినా మందుబాబులు ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడంతో మరుసటిరోజే మరో 50 శాతం ధరలు పెంచేసి వారి మత్తు వదిలించేసింది. అంత ధరపెట్టి మందు కొనుకోవడం చాలా కష్టంగా ఉంది..ఆ ధరలు చూస్తే మత్తు దిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో మందుబాబుల కష్టాలు ఇంకా పెరిగిపోయాయి.
విమర్శలకు భయపడో లేదా హైకోర్టులో మొట్టికాయలు పడతాయనే భయంతోనో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. సంపూర్ణ మద్యపాన నిషేదంలో భాగంగా 33 శాతం మద్యం దుకాణాలను మూసివేయాలని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 4,380 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 1,446 దుకాణాలను మూసివేయించింది.
కనుక ఏపీలో మందుబాబులు 75 శాతం అధిక ధరలు పెట్టి మందుకొనుకొందామనుకొన్నా కష్టమవుతోంది. దాంతో పొరుగు రాష్ట్రం తెలంగాణలో కేవలం 11-16 శాతం మాత్రమే ధరలు పెంచి అమ్ముతుండటంతో ఇప్పుడు ఏపీలో మందుబాబులు అటువైపు నుంచి ‘సరుకు’ రప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
అయినా ప్రభుత్వం సంపూర్ణ మద్యనిషేదం అమలుచేయాలని సంకల్పించుకొన్నప్పుడు, నెలన్నర రోజులుగా మూసి ఉంచిన మద్యం దుకాణాలను తెరవడం ఎందుకు? తెరిచి...మద్యపాననిషేదం కోసమే 75 శాతం ధరలు పెంచామని సమర్ధించుకోవడం ఎందుకు?అని ఏపీలో మహిళలు ప్రశ్నిస్తున్నారు.
పైగా నిత్యావసర సరకులు అమ్మే దుకాణాలను మధ్యాహ్నం ఒంటి గంటకే బంద్ చేయిస్తూ, మద్యం దుకాణాలను మాత్రం రాత్రి 7 వరకు తెరిచి ఉంచడంలో అర్ధమేమిటని ప్రశ్నిస్తున్నారు. మద్యపాన నిషేధంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడం, మద్యం అమ్మకాలతో ఖజానా నింపుకోవాలనే ఆశతోనే మద్యం దుకాణాలు తెరుస్తోందని ప్రతిపక్షాలు, మహిళలు ఆరోపిస్తున్నారు.