
తెలంగాణ ప్రభుత్వం కరోనా లక్షణాలు కనబడిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తుండటంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్ సింగ్, జస్టిస్ విజయసేన్ రెడ్డిల ధర్మాసనం కూడా తెలంగాణ ప్రభుత్వం వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
కరోనా సోకినవారికి మాత్రమే పరీక్షలు నిర్వహించి వారితో సన్నిహితంగా మెలిగినవారికి పరీక్షలు చేయకుండా కరోనా సంఖ్యను ఏవిధంగా నిర్ధారిస్తారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అలాగే మరణించినవారికి కరోనా ఉందో లేదో తెలుసుకోకపోతే ఆ కుటుంబంలో వారికి కరోనా సోకిందో లేదో ఎలా తెలుస్తుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అసలు ఏ ప్రమాణాల ప్రకారం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలపాలని ప్రభుత్వం తరపు వాదించిన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను నిలదీశారు. కరోనా పరీక్షలు, కేసులు విషయంలో అంకెల గారడీలు చేస్తూ మనల్ని మనమే మోసం చేసుకోవడం సరికాదని, వాస్తవ పరిస్థితులు ఆధారంగానే కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
అయితే ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. కానీ ఆయన వాదనలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది. ఆలోగా కరోనా పరీక్షలకు సంబందించి పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది.
కరోనా విషయంలో చైనా దాపరికం పాటించినందుకు ఇప్పుడు యావత్ ప్రపంచదేశాలు భారీ మూల్యం చెల్లిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో నిఖచ్చిగా, పారదర్శకంగా వ్యవహరించకపోతే నిప్పును మూటగట్టుకొన్నట్లే అవుతుంది.