తెలంగాణలో మాస్క్ తప్పనిసరి లేకుంటే...

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఇళ్ళలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించవలసి ఉంటుంది. లేకుంటే రూ.1,000 జరిమానా విధించబడుతుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా శోకాకుండా, వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అందరూ తప్పనిసరిగా మస్కూలు ధరించాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ యధాతధంగా కొనసాగుతుందని తెలిపారు. మందుల దుఖానాలు మినహా మిగిలినవన్నీ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని సూచించారు. గ్రీన్, ఆరెంజ్‌, రెడ్‌ జోన్‌లలో ఆంక్షలు, సడలింపులకు సంబందించి మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. 

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌: 

షాపింగ్ మాల్స్ తప్ప అన్ని రకాల దుకాణాలు నిర్దేశిత నిబందనల ప్రకారం తెరుచుకోవచ్చు. 

అన్ని కార్యాలయాలు 100 శాతం ఉద్యోగులతో పనిచేసుకోవచ్చు. 

టాక్సీలు నడిపించుకోవచ్చు కానీ ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు.  

ఈ-కామర్స్‌ సంస్థలు అన్ని రకాల వస్తువులను సరఫరా చేయవచ్చు.

గ్రామీణ ప్రాంతాలలో అన్ని రకాల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టవచ్చు. 

వ్యవసాయం, ఆసుపత్రులు వాటి అనుబంధ రంగాలు, ఉపాధి హామీ పథకం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ప్రింట్‌ మరియు ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలికం, పోస్టల్‌, ఇంటర్నెట్‌ సేవలు, ఐటీ, ఐటీఈఎస్‌ సంబంధిత సర్వీసులు, నిత్యావసర సరుకుల సరఫరా చైన్‌, పెట్రోల్‌ బంకులకు, ఎల్పీజీ సరఫరాకు ఆంక్షల నుంచి మినహాయింపు.

చేనేత మగ్గాలు, బీడీల తయారీ, ఇటుకబట్టీలు, సాంచాలు, జిన్నింగ్‌ మిల్స్‌, దూది పరుపులు, స్టోన్‌ క్రషర్‌ మిల్స్‌, రిపేర్‌ వర్క్‌షాప్స్‌, ఇసుక తదితర మైనింగ్‌ కార్యకలాపాలు, సిరామిక్‌ టైల్స్‌, రూఫ్‌ టైల్స్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీలు, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఇండస్ట్రీ, ప్లాస్టిక్స్‌ అండ్‌ శానిటరీ పైప్‌ల పరిశ్రమ, పేపర్‌ పరిశ్రమ, ప్లాస్టిక్‌ అండ్‌ రబ్బర్‌ పరిశ్రమలకు అనుమతి.

 రెడ్‌ జోన్‌:  

స్థానిక కార్మికులు లభ్యమతే గృహ నిర్మాణాలు చేపట్టవచ్చు. 

ఈ కామర్స్ సంస్థకు కేవలం నిత్యావసర వస్తువులను మాత్రమే సరఫరా చేయాలి. 

ఆటోలు, క్యాబ్‌లకు అనుమతి లేదు.    

సెజ్ లేదా ఇండస్ట్రియల్‌ ఎస్టేట్స్‌ లేదా ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్స్‌ లలో ఎగుమతి ఆధారిత యూనిట్లు, ఫార్మాస్యూటికల్స్‌, వైద్య పరికరాలు, వాటి ముడిసరుకుల తయారీకి అనుమతి. అలాగే ఐటీ హార్డ్‌వేర్‌ మరియు ప్యాకింగ్‌ తయారీ యూనిట్లకు అనుమతి. 

జీహెచ్‌ఎంసీ, రెడ్‌జోన్‌ ఏరియాలలో ప్రైవేట్‌ కార్యాలయాలు, ఐటీ, ఐటీఈఎస్‌ కార్యాలయాలు 33 శాతం ఉద్యోగులతో పనిచేయించుకోవాలి. మిగిలినవారిని వర్క్‌ఫ్రమ్‌ హోం విధానంలోనే పనిచేయించుకోవాలి. 

రెడ్‌జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సెక్రెటరీ స్థాయివరకు 100 శాతం హాజరుకావాలి. మిగిలిన సిబ్బంది 33 శాతం హాజరైతే చాలు. రక్షణ, సెక్యూరిటీ, వైద్య, పోలీస్‌, వాణిజ్యపన్నులు, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌, రెవెన్యూ, జైళ్లు, హోమ్‌గార్డులు, సివిల్‌ డిఫెన్స్‌, అగ్నిమాపక శాఖ, అత్యవసర సేవలు అందించేవారు, విపత్తుల నిర్వహణ, ఎన్‌ఐసీ, కస్టమ్స్‌, ఎఫ్‌సీఐ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల ఉద్యోగులందరూ యధావిధిగా పనిచేయాలి. 

తదుపరి ఆదేశాలు వెలువడే వరకు రెస్టారెంట్లు, బార్బర్‌ షాపులు, స్పాలు, సెలూన్‌లు, ట్యాక్సీలు, క్యాబ్‌ సర్వీసులు, ఆటోరిక్షాలకు అనుమతి లేదు.

తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అన్ని విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, శిక్షణ కేంద్రాలు, హోటల్స్‌, లాడ్జీలు, బార్లు, పబ్‌లు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌, జిమ్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, స్పోర్ట్స్‌కాంప్లెక్స్‌, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ జూపార్క్‌, మ్యూజియాలు, ఆడిటోరియాలు, అన్ని ప్రార్థనా మందిరాలు మూసి ఉంచాలి. బహిరంగ ప్రదేశాలలో పూజలు, సామూహిక మత ప్రార్థనలు నిషేధం.