తెలంగాణలో సరి-బేసి విధానం అమలు

తెలంగాణలో గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో మునిసిపల్ పరిధిలో ఉండే ప్రాంతాలలో పలు దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని దుకాణాలు ఒకేసారి తెరిస్తే ప్రజలు గుమిగూడే అవకాశం ఉంటుంది కనుక ప్రతీరోజు 50 శాతం దుకాణాలను మాత్రమే తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కరీంనగర్‌లో ఇప్పటికే అమలుచేస్తున్న సరి-బేసి విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ బుధవారం మార్గదర్శకాలను జారీ చేశారు. 

వాటి ప్రకారం అనుమతించబడిన సగం దుకాణాలకు 1,3,5,7 బేసి సంఖ్యలను, మిగిలిన వాటికి 2,4,6,8 సరి సంఖ్యలను కేటాయిస్తారు. బేసి సంఖ్యలు కేటాయించిన దుకాణాలను సోమ, బుద, శుక్రవారాలలో, సరి సంఖ్యల దుకాణాలను మంగళ, గురు, శనివారాలలో తెరిచేందుకు అనుమతిస్తారు. పక్కపక్కనే ఉండే దుకాణాలు ఒకేసారి తెరవకుండా ఉండేవిధంగా సరి, బేసి సంఖ్యలను కేటాయించబడతాయి.  

ఇప్పటికే కిరాణా, కూరగాయలు, పాలు, మందులు ఇతర నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలను తెరుస్తున్నారు. ఇకపై స్టీల్, సిమెంట్, ఎలక్ట్రికల్, హార్డ్ వేర్, ప్లంబింగ్ తదితర భవన నిర్మాణ సామగ్రిని అమ్మే దుకాణాలకు, ఎరువులు, పురుగుల మందులు, తదితర వ్యవసాయ సామాగ్రి అమ్మే దుకాణాలను ఈ పద్దతిలో తెరిచేందుకు అనుమతిస్తారు.