సిఎం దయపై ప్రతిపక్షాలు మనుగడ సాగించడం లేదు: కోదండరాం

సిఎం కేసీఆర్‌ నిన్న ప్రెస్‌మీట్‌లో ప్రతిపక్షపార్టీలను, వాటి నేతలను ఉద్దేశ్యించి చాలా చులకనగా మాట్లాడటంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈరోజు సాయంత్రం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ దయ వలన ప్రతిపక్షాలు మనుగడ సాగించడంలేదని నేను చెప్పదలచుకొన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షపార్టీల ప్రాముఖ్యతను ఆయన గుర్తించలేకపోవడం దురదృష్టకరం. ఆయన బయటకు వచ్చినా రాకపోయినా ప్రజా సమస్యలపై మాట్లాడవలసిన బాధ్యత మాకు ఉంటుంది కనుకనే మాట్లాడుతున్నాము. 

ఇప్పటి వరకు అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళేందుకు చాలా ప్రయత్నించాము కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు. అందుకే రాష్ట్రానికి పెద్దదిక్కుగా ఉండే గవర్నర్‌ను కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లాము. అందుకు సిఎం కేసీఆర్‌ మా గురించి అనుచితంగా మాట్లాడటం చాలా తప్పు. దానిని మేము ఖండిస్తున్నాము. 

ఆయన మా మాటలు ఆలకించకపోయినా మేము ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాము కనుకనే ప్రభుత్వంలో కదలికలు వస్తున్నాయని చెప్పగలను. అందుకోసం కొన్నిసార్లు న్యాయపోరాటాలు చేయవలసి వచ్చింది. ఒక్కోసారి గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వంపై ఒత్తిడి చేయవలసి వచ్చింది. కనుక సిఎం కేసీఆర్‌కు ఇష్టమున్నా లేకున్నా ప్రతిపక్షాలుగా మా బాధ్యత నిర్వర్తిస్తూనే ఉంటాము. అయితే రాజకీయాలలో ఉన్నవారు హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఇంతకంటే నేనేమీ చెప్పదలచుకోలేదు,” అని అన్నారు.