8.jpg)
సిఎం కేసీఆర్ నిన్న ప్రతిపక్షాలను చాలా అనుచితంగా నిందిస్తూ హేళన చేశారు. ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “కాంగ్రెస్ నేతలు ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా సిగ్గులేకుండా దీక్షలు చేస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి, మరే ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనూ నూటికి నూరుశాతం పంటలు కొనడం లేదు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నూటికి నూరుశాతం పంటలను గిట్టుబాటు ధరలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. కానీ ఈ తలమాసినోళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడో పిడుగుపడితే అదీ తెలంగాణ ప్రభుత్వం తప్పేనని వాదిస్తున్నారు. ఈ తాలూగాండ్లు, తలమాసినోళ్ళు చిల్లర రాజకీయాలు చేస్తుంటే మేము చూస్తూ భరించాలా?పనీపాటు లేకుండా గాంధీభవన్‌లో కూర్చొని దీక్షలు చేస్తూ ప్రజలకు వినోదం పంచుతున్న వాళ్ళను ఏమనాలి...బఫూన్ గాళ్ళనే కదా? అటువంటి తలమాసినోళ్ళకు మేము అపాయింట్మెంట్ ఇచ్చి చర్చలు జరపాలా? ఇటువంటి వేస్ట్ ఫెలోస్‌తో ఎవరు మాట్లాడుతారు? వాళ్ళతో మాట్లాడటం టైమ్ వేస్ట్.
నిన్న వాళ్ళందరూ కలిసి సిగ్గులేకుండా గవర్నర్ దగ్గరకు వెళ్ళి మా ప్రభుత్వంపై కరోనా మరణాలు దాచి పెడుతోందని పిర్యాదులు చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి? కరోనాతో ఇంకా ఎక్కువ మంది చచ్చిపోవాలని కోరుకొంటున్నారా? అయినా కరోనా కేసులు, మరణాలు దాస్తే దాగేవా? అసలు వాళ్ళకి ఏ అంశం ఎత్తుకోవాలో...ఏవిధంగా పోరాడాలో కూడా తెలియని సన్నాసులు. వాళ్ళని ప్రతిపక్షాలని అనడం కూడా సరికాదు. ఒకడికి డిపాజిట్లే రావు. ఒకడిది ఇరుగింటి పార్టీ..మరొకడిది పొరిగింటి పార్టీ. వీళ్ళా ప్రతిపక్షాలు?వాళ్ళను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. అయినా సిగ్గులేకుండా చిల్లర రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు.
రాష్ట్ర ప్రజలకు మాపై నమ్మకం ఉండబట్టే మళ్ళీ మాకు అధికారం అప్పగించారు. కనుక రాష్ట్రాన్ని... ప్రజలను ఏవిధంగా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. ఒకవేళ మేము తప్పు చేస్తున్నామని ప్రజలు భావిస్తే వాళ్ళే శిక్షిస్తారు. అందుకు మేము ఎప్పుడూ సిద్దంగానే ఉంటాము,” అని సిఎం కేసీఆర్ అన్నారు.