14.jpg)
సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “కరోనాను కట్టడి చేయడంలో మనకంటే కేరళ బాగా పనిచేస్తోంది. మనం కూడా రాష్ట్రంలో కరోనాను పూర్తిగా కట్టడి చేయవలసిన అవసరం ఉంది. అందుకు ప్రజల సహకారం ఎంతైనా అవసరం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ ఈ దశలో ఎటువంటి ప్రయోగాలు చేయలేము. చేస్తే ఎటువంటి విపత్కర పరిస్థితుల ఎదురవుతాయో ముంబై, డిల్లీ తదితర నగరాలలో చూశాము. ఇప్పుడు వాహనాలను రోడ్లపైకి అనుమతిస్తే వాటిని నియంత్రించడం కష్టం అవుతుంది కనుక సామాజికదూరం పాటించలేము. కనుక హైదరాబాద్ నగరంలో కూడా అన్ని ప్రాంతాలలో కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాతే లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తాము. ఈనెల 15నాటికి హైదరాబాద్‌తో రాష్ట్రంలో అనేక జిల్లాలు గ్రీన్ జోన్‌లోకి వస్తాయని ఆశిస్తున్నాము. కనుక 15న మరోసారి పరిస్థితులను సమీక్షించి వీలైతే ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్దరిస్తాము. అయితే కరోనా తీరు చూస్తే అది ఇప్పట్లో పోయేలా లేదు కనుక మనం దానితో కలిసి బతకడం నేర్చుకోక తప్పదు,” అని అన్నారు.