
తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకొన్న వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలింపు జరుగుతున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా మంగళవారం తెల్లవారుజాము 3.20 గంటలకు ఘట్కేసర్ రైల్వే స్టేషన్ నుంచి పాట్నాకు శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. దానిలో మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన 1,250 వలస కార్మికులను పాట్నాకు తరలించారు.
స్వరాష్ట్రాలకు వెళ్లదలచుకొన్న వలస కార్మికులు తమ పేర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులలో లేదా స్థానిక ప్రభుత్వ సమాచార కేంద్రాలలో లేదా స్థానిక పోలీస్‌స్టేషన్లలో నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఆ జాబితాలను జిల్లా కలక్టర్లు పరిశీలించి తెలంగాణ నోడల్ అధికారి సందీప్ సుల్తానియా అనుమతితో ఖరారు చేస్తారు. కలక్టర్ల నుంచి వచ్చిన ఆ సమాచారాన్ని సందీప్ సుల్తానియా రైల్వే ఉన్నతాధికారులకు పంపిస్తే వారు రైళ్ళను ఏర్పాటు చేస్తారు.
శ్రామిక్ రైళ్ళు మొదలైన తరువాత తెలంగాణ నుంచి శుక్రవారం మొట్టమొదటి రైలు ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారిని తీసుకువెళ్లింది. ఈరోజు బిహార్ కార్మికులను తీసుకువెళుతోంది. బుదవారం నుంచి ప్రతీరోజు వివిద రాష్ట్రాలకు శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు నడిచే అవకాశం ఉందని తాజా సమాచారం.