
దేశవ్యాప్తంగా వలస కార్మికుల తరలింపు ప్రక్రియ మొదలవడంతో ఇంతకాలం తమ స్వస్థలాలకు వెళ్ళలేమని తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్న వారిలో మళ్ళీ ఆశలు చిగురించాయి. ప్రతీరోజు కొంతమంది శ్రామిక్ రైళ్ళలో ఊళ్ళకు తరలిపోతుండటంతో మిగిలినవారిలో నానాటికీ భావోద్వేగాలు పెరిగిపోతున్నాయి. కానీ లాక్‌డౌన్‌తో దివాళా స్థితికి చేరుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ఖర్చును భరించాలని కేంద్రప్రభుత్వం చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వెనకడుగువేస్తున్నాయి.
ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు. వలస కార్మికుల తరలింపుకయ్యే మొత్తం ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరించడానికి సిద్దంగా ఉందని లిఖితపూర్వకంగా ప్రకటించారు. విదేశాలలో చిక్కుకొన్నవారిని తిరిగి తీసుకువచ్చేందుకు సిద్దపడుతున్న కేంద్రప్రభుత్వం, దేశానికి వెన్నెముక వంటి నిరుపేద వలస కార్మికులను ఆదుకోలేదా? అని సోనియా గాంధీ ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం ఆదుకోనందున వారికి తమ పార్టీ అండగా నిలబడుతుందని సోనియా గాంధీ ప్రకటించారు. రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ శాఖలు ఈ బాధ్యతను స్వీకరిస్తాయని తెలిపారు.