
కరోనా మహమ్మారితో భారత్ పోరాడుతుంటే ఇదే అదునుగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఏదోవిధంగా భారత్‌లోకి జొరబడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరింత బరి తెగించి, సరిహద్దు గ్రామాల ప్రజలను కిడ్నాప్ చేసి భద్రతాదళాలకు సవాలు విసురుతున్నారు.
ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలోని రాజ్వార్ అడవులలో చంగిముల్లా అనే ఓ గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి ప్రవేశించి ఆ కుటుంబాన్ని నిర్బందించారు. సమాచారం అందుకొన్న 21వ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, నాయక్ రాజేష్, లాన్స్ నాయక్ దినేష్ సింగ్, జమ్ముకశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ షకీల్ ఖాజీలను వెంటపెట్టుకొని ఆ ప్రాంతానికి చేరుకొన్నారు.
కానీ అక్కడే ఒక పెద్ద పొరపాటు జరిగింది. ఉగ్రవాదులపై సమీపం నుంచి దాడి చేయాలని భావించిన వారు ఆ పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించారు. కానీ అదే ఇంట్లోనే దాగి ఉన్న ఉగ్రవాదులు లోపలకు వచ్చిన ఆ ఐదుగురిని వెంటనే కాల్చి చంపారు. ఈ సమాచారం అందుకొన్న ఆర్మీ అసాల్ట్ బృందాలు ఆదివారం తెల్లవారుజామున ఆ ఇంటిని చుట్టుముట్టి లోపల దాగి ఉన్న ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టి బందీలను విడిపించి, తమ సహచరుల శవాలను స్వాధీనం చేసుకొన్నాయి.
ఆర్మీ చేతిలో మరణించిన ఉగ్రవాదులలో ఒకరు నిషేదిత ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా సంస్థ హైకమాండర్ హైదర్ అని గుర్తించినట్లు జమ్ముకశ్మీర్ డిజిపి దిల్బాగ్ సింగ్ తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన అతను గత కొంతకాలంగా ఉత్తర కశ్మీర్‌లో ఉగ్రవాదకార్యకలాపాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిపారు.
కల్నల్ అశుతోష్ శర్మ ధైర్యసాహాసాలకు మెచ్చి కేంద్రప్రభుత్వం రెండుసార్లు సేన పతకంతో గౌరవించింది. ఆయనకు భార్య, 12 ఏళ్ళు వయసున్న కుమార్తె ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ బ్రిగేడియర్ చంద్రకాంత్ ఏకైక కుమారుడే మేజర్ అనూజ్ సూద్. తండ్రి ప్రేరణతో ఆర్మీలో ప్రవేశించారు. మేజర్ అనూజ్ సూద్‌కు నాలుగు నెలల క్రితమే వివాహం అయ్యింది.
నాయక్ రాజేష్(29), లాన్స్ నాయక్ దినేష్ సింగ్ (24) ఇద్దరూ కూడా చాలా ధైర్యవంతులే. అందుకే ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు వారిద్దరినీ కల్నల్ అశుతోష్ శర్మ ఎంచుకొన్నారు.
జమ్ముకశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన షకీల్ ఖాజీ(41)కి మొదటి నుంచి సవాళ్ళతో కూడిన పోలీస్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. అందుకే పోలీస్ కానిస్టేబుల్‌గా చేరి ఉగ్రవాదులతో పోరాడే స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపులో చేరారు. ఆయన 2009లో షేర్ ఏ కాశ్మీర్, 2011లో పోలీస్ శౌర్య పతకాలు పొందారు.ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.
ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ, నేవీ, వాయుసేనల అధినేత బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే తదితరులు దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన ఆ ఐదుగురు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.