దేశంలో కరోనా వైరస్ బయటపడిన కొత్తలో 14 రోజులు క్వారెంటైన్ పాటిస్తే కరోనా గొలుసును తెంచవచ్చునని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్యశాఖ నిపుణులు భావించారు. కనుక దేశంలో మొట్టమొదటిసారిగా మార్చి 24 నుంచి ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్ ప్రకటించి అమలుచేసింది. దానిని మే3వరకు మరోసారి పొడిగించింది. తాజాగా మే 17వరకు మరోసారి పొడిగించింది. ఏకధాటిగా 54 రోజులు లాక్‌డౌన్ చేసుకొంటున్నప్పటికీ దేశంలో కరోనా కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. కనీసం ఆగడం లేదు!
రావణాసురుడికి ఒక తల ఖండిస్తే మరో తల పుట్టుకొచ్చినట్లు, వైద్యసిబ్బంది ఎంతో కష్టపడి 100 కేసులు నయం చేసి పంపిస్తే 200 కేసులు వస్తుండటంతో కరోనాతో ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వారందరూ కూడా చాలా అలసిపోయున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థను, కోట్లాదిమంది నిరుపేద ప్రజల జీవితాలను పణంగా పెట్టి ఏకధాటిగా లాక్‌డౌన్ చేస్తున్నప్పటికీ కరోనా నియంత్రణలోకి రాకపోవడం చాలా నిరాశ కలిగించే విషయమే.
ఈ లాక్‌డౌన్‌తో కరోనా గొలుసును తెంచలేమని స్పష్టమైనప్పటికీ, ఒకవేళ లాక్‌డౌన్ విధించకపోయుంటే భారత్‌లో కూడా అమెరికాలాగే లేదా అంతకు నాలుగు రెట్లు కరోనా కేసులు, మరణాలు సంభవించి ఉండేవనే ఒకే ఒక్క ఆలోచనతో లాక్‌డౌన్ కొనసాగించవలసి వస్తోంది.
అయితే నానాటికీ పెరుగుతున్న కేసులు, మరణాలు చూస్తుంటే దీనికి ముగింపు ఎప్పుడు? అప్పటివరకూ భారత్‌లో ఇంకా ఎన్ని కేసులు పెరుగుతాయి? ఇంకా ఎంతమంది బలవ్వాలి?అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో కలుగుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. కరోనా వ్యాక్సిన్ లేదా నివారణ మందు అందుబాటులోకి రావడం!
దానికి మరో ఆరేడు నెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. గత నెలరోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు గమనిస్తే ప్రతీ 10 రోజులకు సుమారుగా రెట్టింపు అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆ ప్రకారం చూస్తే మరో ఆరేడు నెలలలో భారత్‌లో కూడా 2-3 లక్షల కేసులు, వేలసంఖ్యలో మరణాలు సంభవించే ప్రమాదం కనిపిస్తోంది.
కనుక కరోనాను తాత్కాలికంగానైనా కట్టడి చేసేందుకు భారతీయ శాస్త్రవేత్తలు తగిన వ్యాక్సిన్ కనుగొనవలసి ఉంటుంది. అలాగే లాక్‌డౌన్ కారణంగా క్షీణిస్తున్న దేశ ఆర్ధిక పరిస్థితిని మళ్ళీ గాడిన పెట్టేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్ధిక నిపుణులు, మేధావులు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలను రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే కరోనా మహమ్మారి నుంచి దేశం బయటపడే సమయానికి దేశ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా చితికిపోతే అది మరో మహా సంక్షోభం అవుతుంది. దానిని తట్టుకోవడం ఇంకా కష్టం.