తెలంగాణ ప్రభుత్వంపై బండి విమర్శలు

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎంపికైన బండి సంజయ్‌ కుమార్ బుదవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ గొప్పగా చెప్పుకోవడం కోసం మే 7వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు కానీ హైదరాబాద్‌ పాతబస్తీవైపు కన్నెత్తి చూడటం లేదు. రాష్ట్రంలో ప్రజలందరూ లాక్‌డౌన్‌ పాటిస్తుంటే పాతబస్తీలో చాలా మంది యాదేచ్చగా లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తున్నారు. ఒకవేళ పాతబస్తీలో లాక్‌డౌన్‌ అమలుచేయడం తెలంగాణ ప్రభుత్వం వలన కాదనుకొంటే కేంద్రబలగాలను రంగంలో దింపాలి. 

సిఎం కేసీఆర్‌ ఎల్లప్పుడూ మజ్లీస్ నేతలను, మైనార్టీ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకొనేందుకే ఆలోచిస్తుంటారు. అందుకే రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిలిపివేశారు. కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతీరోజు కనీసం 2,000 మందికి పరీక్షలు జరిపించవలసి ఉంటుంది. కానీ కరోనా పరీక్షలు నామమాత్రంగా చేస్తూ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. కరోనా కేసుల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడి చేసి నోళ్ళు మూయించి అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. గద్వాల, వికారాబాద్‌లో హటాత్తుగా కరోనా పరీక్షలు ఎందుకు నిలిపివేశారు? 

 డిల్లీ మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారి వలననే దేశంలో మళ్ళీ కరోనా వ్యాపించిందని స్పష్టమైనప్పుడు, వారిని స్వచ్ఛందంగా బయటకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా ఎందుకు చెప్పడం లేదు?ఈవిషయంలో సిఎం కేసీఆర్‌ ఓవైసీని గట్టిగా ఎందుకు నిలదీయడంలేదు? రాష్ట్రానికి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పటికీ అంతా ఓవైసీ కనుసన్నలలో నడుస్తున్నట్లుంది. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా రాష్ట్రంలో కరోనా వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలి. పాతబస్తీలో లాక్‌డౌన్‌ ఖచ్చితంగా అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాను,” అని అన్నారు.