వలస కార్మికుల తరలింపుకు లైన్ క్లియర్

వివిద రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్దులు, పర్యాటకులను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రప్రభుత్వం ఈరోజు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తరలింపు ప్రక్రియతో సంబందం ఉండే అన్ని కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖలకు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు పంపించారు. ఈ తరలింపు ప్రక్రియ మొదలుపెట్టడానికి మరో నాలుగైదురోజులు సమయం పట్టవచ్చు కనుక మే 4వ తేదీ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.  

1. అన్ని రాష్ట్రాలు నోడల్ అధికారులను నియమించుకొని తమ తమ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వారి వివరాలను సేకరించాలి.

2. తరువాత రెండు రాష్ట్రాల అధికారులు సంప్రదింపులు జరుపుకొని అవసరమైన రవాణా (బస్సులు), ఆహారం, మస్కూలు వగైరా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. 

3. ప్రయాణ సమయంలో కరోనా వ్యాపించకుండా ప్రతీ బస్సును పూర్తిగా శానిటైజ్ చేయాలి. బస్సులో కూడా భౌతికదూరం పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణానికి ముందే అందరికీ పరీక్షలు జరపాలి. అలాగే ప్రయాణం ముగిసిన తరువాత కూడా వారి స్వస్థలాలలో విధిగా వైద్య పరీక్షలు నిర్వహించి, కరోనా లక్షణాలున్నవారిని క్వారెంటైన్‌కు తరలించాలి. మిగిలినవారిని తప్పనిసరిగా 14 రోజులపాటు హోం క్వారెంటైన్‌లో ఉంచాలి. 

4.  బస్సులలో తరలిస్తున్న వారందరికీ విధిగా కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆరోగ్యసేతు’ మొబైల్ యాప్‌తో అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలి.