కరోనా కేసులలో దాపరికం లేదు: ఈటల

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, “కరోనా పాజిటివ్ కేసుల గురించి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. పాజిటివ్ కేసులను దాచిపెట్టవలసిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ఎక్కడ ఎన్ని కేసులు బయటపడితే అన్ని ప్రకటిస్తున్నాము. ఈరోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 6 కేసులు నమోదు అయ్యాయి. వాటితో కలిపి మొత్తం 1,009 కేసులయ్యాయి.  ప్రస్తుతం 610 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 374 మంది డిశ్చార్జ్ అయ్యారు...25 మంది మృతి చెందారు. ఈనెల 21 నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. త్వరలోనే తెలంగాణ కరోనారహితరాష్ట్రంగా మారుతుందని భావిస్తున్నాము. కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల కేంద్రప్రభుత్వం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నాము. కరోనా నివారణకు అత్యుత్తమమైన మందులు ప్రపంచంలో ఎక్కడ లభించినా వాటిని రప్పించి రాష్ట్ర ప్రజలకు కరోనా నుంచి విముక్తి కల్పిస్తాము,” అని అన్నారు.