
లాక్‌డౌన్ గడువు దగ్గర పడుతున్నందున తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ సోమవారం ఉదయం డిల్లీ నుంచి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ అమలు, నిత్యావసర సరుకులు, రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు తదితర అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా మే 3తో లాక్‌డౌన్ గడువు ముగుస్తోంది కనుక దానిని మళ్ళీ మరికొన్ని రోజులు పొడిగించడం, మే 3 తరువాత ఏఏ రంగాలు, వ్యవస్థలకు ఏ మేరకు లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు ఇవ్వాలి? సడలింపులు ఇచ్చినప్పుడు కరోనా వ్యాప్తి చెందకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై చర్చించబోతున్నారు.
ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పైగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కనుక మరో రెండువారాలు లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలే ఎక్కువున్నాయి. అయితే లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్ధికవ్యవస్థ క్షీణిస్తోంది కనుక ఈసారి వివిద రంగాలలోని కొన్ని వ్యవస్థలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఈయడం ఖాయం. అయితే రైల్వే, మెట్రో, బస్, విమానయాన సర్వీసులు, హోటల్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్, వ్యాయామశాలలు, ఆలయాలు,చర్చిలు, మసీదులు, జనస్మూహమ్ ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న వాటికి ఎటువంటి మినహాయింపు ఈయకపోవచ్చు.