ప్రపంచ ఆరోగ్య సంస్థకు ధీటుగా మరో సంస్థ?

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, “వుహాన్‌లోనే కరోనా పుట్టిందనే విషయం త్వరలోనే మేము ప్రపంచదేశాలకు నిరూపించబోతున్నాము. కరోనాకు సంబందించి సమాచారం పంచుకోకుండా ప్రపంచదేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన చైనా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. కరోనాతో అమెరికాలో సంభవిస్తున్న ఈ మరణాలకు, ఆర్ధిక సంక్షోభానికి కారకులైనవారు పూర్తి బాధ్యత వహించాలి. 

 ఈ ప్రాణాంతక కరోనా వైరస్ గురించి చైనా గోప్యత పాటిస్తే, కరోనా ప్రమాదం గురించి ప్రపంచదేశాలను ముందుగా హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. కనుక భవిష్యత్‌లో మళ్ళీ ఇటువంటి సమస్యలు ఎదురైతే వాటిని ముందే పసిగట్టి ప్రపంచదేశాలను అప్రమత్తం చేసేందుకు అమెరికా ఒక సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది. ఈ ఆర్ధిక సంక్షోభం నుంచి కోలుకొనేందుకు ప్రపంచదేశాలకు అమెరికా యధాశక్తిన సాయం చేస్తుంది. సరైన సమయంలో ఆంక్షలను కూడా ఎత్తివేస్తాము,” అని అన్నారు.