
లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్రమంత్రిత్వశాఖలకు చెందిన బృందాలను పంపించింది. వాటిలో గుజరాత్‌కు రెండు, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ఒక్కొక్కటి చొప్పున బృందాలను పంపించింది.
తెలంగాణకు కేటాయించిన కేంద్ర బృందం శనివారం హైదరాబాద్ చేరుకొని మొట్టమొదట గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(టిమ్స్)ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించింది. అనంతరం నగరంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రెడ్ జోన్‌లలో పర్యటించి, కరోనా కట్టడికి, ఆ ప్రాంతాలలో నివశిస్తున్న ప్రజల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తాయి.
లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా? వైద్యసిబ్బందికి తగిననన్ని వ్యక్తిగత రక్షణ దుస్తులు, మాస్కూలు, హ్యాండ్ గ్లౌజులు వగైరాలు అందుబాటులో ఉన్నాయా లేవా? రాష్ట్రంలో వలస కార్మికులకు సహాయం అందుతోందా లేదా?వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా లేదా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై ప్రజలు ఏమనుకొంటున్నారు? వంటి అనేక అంశాలపై కేంద్ర బృందాలు అధ్యయనం చేసి కేంద్రప్రభుత్వానికి నివేదికలు ఇస్తాయి. వాటి ఆధారంగా కేంద్రప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకొంటుంది.