
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలుచర్యల వలన తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరోవైపు కరోనా చికిత్స పొంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, “ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 13 కేసులు నమోదు అయ్యాయి. వాటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 983కి చేరింది. కరోనా కేసులలో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదు అయ్యాయి. వాటిలో 268 కేసులు 44 కుటుంబాలకు చెందినవిగా గుర్తించాము. ఇప్పటివరకు 291 మంది కరోనా చికిత్స పొంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రులలో ఉన్న కరోనా రోగులలో ఏడుగురు మాత్రమే వెంటిలేటర్‌పై ఉన్నారు. మిగిలినవారందరూ కొలుకొంటున్నారు. ఇకపై ప్రతీరోజు సుమారు 50 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.
ఆసుపత్రులలో చేరిన కరోనా రోగులకు అత్యుత్తమైన చికిత్సతో పాటు మంచి పౌష్టికాహారం కూడా అందిస్తున్నందునే ఇది సాధ్యం అవుతోంది. కనుక రోగులకు ఆహారం అందడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఇప్పటివరకు 25 మంది కరోనాతో మృతి చెందారు. ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలతో హైదరాబాద్‌తో సహా గద్వాల, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. త్వరలోనే రాష్ట్రం కరోనా నుంచి విముక్తి పొందుతుంది,” అని అన్నారు.