లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి మరికొన్ని మినహాయింపులు

దేశంలో లాక్‌డౌన్‌ విధించిన నేటికి 30 రోజులు పూర్తయ్యాయి. ఇంకా మరో 10 రోజులు అంటే మే 3వరకు లాక్‌డౌన్‌ కొనసాగబోతోంది. దేశంలో కరోనా నియంత్రణలో ఉన్నప్పటికీ రోజురోజుకీ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి కనుక మే 3 తరువాత కూడా మరో రెండువారాలు లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో చిన్నా, పెద్ద సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాటిల్లో పనిచేసే కోట్లాదిమంది పనివారు రోడ్డున పడుతున్నారు. కనుక వారి సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం ఈరోజు మరికొన్న సంస్థలకు లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. 

పట్టణ ప్రాంతాలలో ఉండే మొబైల్ రీఛార్జింగ్, ఎలక్ట్రికల్, స్టేషనరీ దుకాణాలకు, మిల్క్, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమలు, నిర్మాణ పనులకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిస్తున్నట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి సలీల శ్రీవాత్సవ డిల్లీలో ప్రకటించారు. అయితే హాట్ స్పాట్-రెడ్‌ జోన్‌లలో ఉన్నవాటికి ఇవి వర్తించవని తెలిపారు.   

గతంలో కొన్ని సంస్థలు, వ్యవస్థలకు కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి ఆంక్షలతో కూడిన మినహాయింపు ఇచ్చింది. ఆ వివరాల కోసం http://www.mytelangana.com/telugu/Admin/updateNewsContent/20707/viewNewsContents       లింక్‌పై క్లిక్ చేయగలరు.    

కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ గడచిన 24 గంటలలో దేశంలో కొత్తగా నమోదైన 1409 కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 21,393కి చేరింది. గురువారం ఒక్కరోజునే దేశవ్యాప్తంగా 388 మంది కోలుకొన్నారు. వారితో కలిపి మొత్తం 4,257 మంది కోలుకొన్నారు. ఇప్పటి వరకు మొత్తం దేశంలో 686 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో వివిద రాష్ట్రాలలోని 12 జిల్లాలలో గత 28 రోజులలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. గత 14 రోజులలో 78 జిల్లాలలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, కేసులు రెట్టింపు అయ్యే వ్యవధి క్రమంగా పెరిగింది. అంటే లాక్‌డౌన్‌తో కరోనా వేగం తగ్గింది,” అని అన్నారు.