
దేశవ్యాప్తంగా మే 3వరకు లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ కేరళ ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ ఉత్తర్వులివ్వడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖ కూడా వ్రాసింది. రాష్ట్రంలో హోటల్స్, పుస్తకాలు, మరికొన్ని రకాల వస్తువులను అమ్మే దుకాణాలు తెరిచేందుకు కేరళ ప్రభుత్వం అనుమతించింది. అలాగే కొన్ని పట్టణాల మద్య కార్లు, బస్ సర్వీసులు కూడా ప్రారంభించింది.
“ఈవిధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాక్‌డౌన్ ఆంక్షలకు సడలింపులు ఇవ్వడం వలన కరోనా సమస్య ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కనుక అన్ని రాష్ట్రాలు విధిగా లాక్‌డౌన్ అమలుచేయాలి. దానికోసం విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జారీ చేసిన నిబందనలను, మార్గదర్శకాలను విధిగా పాటించాలి,” అంటూ కేంద్రహోంశాఖ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ ద్వారా హెచ్చరించారు.
కేంద్రం హెచ్చరికపై కేరళ మంత్రి సురేంద్రన్ స్పందిస్తూ, “కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారమే లాక్‌డౌన్ అమలుచేస్తున్నాము. వాటిని అతిక్రమించలేదు. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు విషయంలో కొంత సమాచార లోపం చేతనే ఈ సమస్య ఏర్పడింది. దీనిపై మేము కేంద్రప్రభుత్వానికి వివరణ ఇచ్చాము,” అని చెప్పారు.