
ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా దూరదృష్టితో ఆలోచించి నిర్మింపజేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో ఈసారి బారీగా పంటలు పండాయి. లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగాలు, ఉపాది ఆదాయం కోల్పోయినవారిని ఆదుకొనేందుకు ప్రతీకుటుంబానికి ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించడంతో దేశంలో హటాత్తుగా బియ్యానికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో పేదలకు బియ్యం పంపిణీకి తీవ్ర కొరత ఏర్పడింది. ఆ రాష్ట్రాలన్నిటికీ తెలంగాణ నుంచే రోజూ గూడ్స్ రైళ్ళలో బారీగా బియ్యం సరఫరా అవుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు క్రింద ఈసారి లక్షల ఎకరాలలో వరి, మొక్కజొన్న తదితర పంటలు పండించారు ఈసారి బారీగా పంటలు పండినప్పటికీ కరోనా కారణంగా లోడింగ్, ఆన్‌లోడింగ్ కార్మికులు పనిచేయడానికి భయపడుతున్నారు. కనుక ఫుడ్ కార్పొరేషన్ సంస్థ అధికారులు వారికి మాస్కూలు, శానిటైజర్లు వగైరాలన్నీ అందజేస్తూ బియ్యం సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో భారీగా పంటలు పడినందుకు పండుగ చేసుకోవాలనుకొన్నామని కానీ కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఆ ఆలోచన విరమించుకోవలసి వచ్చిందని సిఎం కేసీఆర్ అన్నారు.