
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో చాలా మందికి ఉపాది, ఆదాయం లేకుండాపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. కనుక రాష్ట్రంలో ఇళ్ళ యజమానులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చి, ఏప్రిల్, మే నెలల ఇళ్ళ అద్దెలు వసూలు చేయొద్దు. ఈ మూడు నెలల అద్దెలను తరువాత వాయిదాల పద్దతిలో తీసుకోండి. మూడు నెలల తరువాత తీసుకొంటున్నాము కదా.. అని మళ్ళీ దానిపై వడ్డీ వసూలు చేయరాదు. ప్రస్తుత సంక్షోభ సమయంలో సమాజంలో అందరూ ఒకరికొకరు సహకరించుకోవడం చాలా అవసరం అందుకే మూడు నెలలు పాటు ఇళ్ళ అద్దెలు వసూలు చేయవద్దని కోరుతున్నాను. ఇది కేవలం విజ్ఞప్తి మాత్రమే కాదు ప్రభుత్వ ఆదేశం కూడా. కనుక ఇళ్ళ యజమానులు అందరూ తూచా తప్పకుండా ఈ ఆదేశాలను పాటించాలి. ఎవరైనా బలవంతంగా అద్దెలు వసూలు చేస్తున్నట్లయితే అద్దెకున్నవారు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటారు,” అని చెప్పారు.
రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలకు కూడా సిఎం కేసీఆర్ ఓ విజ్ఞప్తి చేశారు. “ప్రస్థత సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 2020-21 విద్యాసంవత్సరంలో అన్ని పాఠశాలలు ఒక్క ట్యూషన్ ఫీజు తప్ప ఆధానంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయరాదు. అదికూడా..సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెల్లించాలని బలవంతం చేయకుండా ఏ నెలకానెల మాత్రమే తీసుకోవాలి. ఇది ప్రభుత్వ ఆదేశం కనుక అన్ని ప్రైవేట్ పాఠశాలలు పాటించి తీరాల్సిందే. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కటినచర్యలు తీసుకోవడమే కాక ఆ పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేస్తాము,” అని హెచ్చరించారు.