
సిఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశం తరువాత సిఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మంత్రివర్గ నిర్ణయాలు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ మే 7వరకు పొడిగిస్తున్నట్లు సిఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం నుంచి కొన్ని పరిశ్రమలు, వ్యవస్థలు, సంస్థలకు లాక్‌డౌన్ ఆంక్షల నుంచి పాక్షికంగా మినహాయింపునిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా లాక్‌డౌన్ ఆంక్షలు యధాతధంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు సిఎం కేసీఆర్ చెప్పారు. కరోనా తీవ్రతను బట్టి జిల్లా స్థాయిలో అవసరమైతే మరింత కటినంగా లాక్‌డౌన్ అమలుచేసినా అభ్యంతరం లేదని సిఎం కేసీఆర్ చెప్పారు.
లాక్‌డౌన్ పొడిగింపుపై ఈరోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నందున ముందుగానే వివిద సంస్థల ద్వారా సర్వేలు చేయించానని చెప్పారు. తాను కూడా స్వయంగా రాష్ట్రంలో లాయర్లు, వైద్యులు, మీడియా వంటి వివిదరంగాలకు చెందిన ప్రముఖులతో, అలాగే సామాన్య రైతులు, కార్మికులు, పౌరులతో కూడా ఫోన్లో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొన్నానని సిఎం కేసీఆర్ చెప్పారు. సర్వేలలో, తాను వ్యక్తిగతంగా మాట్లాడినవారు అందరూ లాక్‌డౌన్ పొడిగించడమే మంచిదని అందుకు తాము రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారని సిఎం కేసీఆర్ చెప్పారు. కనుక రాష్ట్రంలో మే7వరకు లాక్‌డౌన్ యధాతధ ఆంక్షలు, మార్గదర్శకాలతో కొనసాగుతుందని సిఎం కేసీఆర్ తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ సంస్థలు అనుమతి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అయితే నిత్యావసరసరుకులు, కూరగాయలు, పాలు, పళ్ళు, మందుల సరఫరా యధాతధంగా కొనసాగితాయని తెలిపారు.