4.jpg)
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రోజూ కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 50 కేసులు నమోదవడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కి చేరింది. ఈరోజు కొత్తగా నమోదైన కేసులలో సూర్యపేట జిల్లాలోనే 16 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. జిల్లాలో ఒకేసారి అన్ని కరోనా కేసులు బయటపడటంతో జిల్లా అధికారులు వెంటనే వారినందరినీ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి, వారితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి క్వారంటైన్‌లోకి పంపించడం ప్రారంభించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సిఎం కేసీఆర్ ఇంచుమించు ప్రతీరోజూ ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కార్యాచరణను రూపొందిస్తున్నారు. అయినా రాష్ట్రంలో కరోనా కేసులు ఆగడంలేదు. ఈ పరిస్థితులలో కేంద్రప్రభుత్వం సూచనలు, మార్గదర్శకాల మేరకు ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలు, సంస్థలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వవలసి ఉంది కనుక వాటిపై చర్చించేందుకు సిఎం కేసీఆర్ ఈనెల 19న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నట్లు తాజా సమాచారం.