కేంద్రప్రభుత్వానికి రాహుల్‌ గాంధీ సూచనలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చాలా రోజుల తర్వాత ఇవాళ్ళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రప్రభుత్వానికి కొన్ని ముఖ్య సూచనలు చేశారు. 

ప్రస్తుతం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ వచ్చినవారిని గుర్తించి వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నాయి. కానీ ఈవిధంగా కరోనా మహమ్మారిని ఎప్పటికీ కట్టడి చేయలేము. కరోనా వైరస్‌ను వెనుక వెళుతూ కరోనా సోకినవారి గుర్తించడం కాక, దాని వెంటబడి తరిమే స్థాయిలో మనం పరీక్షలు నిర్వహించాలి. అందుకోసం ఇప్పుడు చేస్తున్న కరోనా పరీక్షలను 100 రెట్లు వేగం పెంచవలసి ఉంటుంది. అప్పుడే కరోనా కంటే ముందుండి అడ్డుకోగలుగుతాము.  

కరోనా దెబ్బకు దేశంలో కోట్లాదిమంది నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఇప్పుడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తమ గోదాములలో ఉన్న బియ్యం, గోదుమలు వంటి ఆహారధాన్యాలను వీలైనంత వేగంగా వారికి అందేలా చేయాలి. దేశంలో రేషన్ కార్డులు లేనిపేదవారు కోట్లమంది ఉన్నారు. వారికి కూడా అవి సరఫరా చేసి వారి ప్రాణాలను కాపాడాలి. దేశ ఆర్ధిక పరిస్థితుల కంటే మనుషుల ప్రాణాలు కాపాడటమే ముఖ్యం.

అలాగే ప్రతీ కుటుంబానికి వీలైనంత వేగంగా ఆర్ధికసాయం అందించాలి. నిరుపేదలకు ఆహారం అందేలా చూడటం, వారి కనీసావసరాలకు చేతిలో తగినంత సొమ్ము ఉండేలా చేయడం వంటివన్నీ జిల్లా స్థాయిలో చేయవలసిన పనులే కనుక రాష్ట్రాలకు మరిన్ని నిధులు, అందిస్తూ, ముఖ్యమంత్రులకు మరింతగా సహాయసహకారాలు అందజేస్తూ జిల్లా యంత్రాంగం చురుకుగా పనిచేసేలా చేయాలి.   

కరోనాను ఎదుర్కోవడంలో జరిగిన లోపాలు, తప్పుల గురించి నేను ఇప్పుడు మాట్లాడదలచుకోలేదు. ఇక ముందు మనం చేయవలసిన వాటి గురించి మాత్రమే మాట్లాడుతాను. కరోనా దెబ్బకు దేశంలో లక్షలాదిమంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. ఇంకా కోల్పోతారు కూడా. కనుక రానున్న రోజులలో దేశం నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకు ఏమి చేయాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ఆలోచించి తగిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. సాధారణంగా చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, సంస్థలు ఎక్కువశాతం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటాయి. కనుక కేంద్రప్రభుత్వం వాటికి రాయితీలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. 

ఇక ఈ కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా రానున్న రోజులలో దేశం అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొనుంది. దేశంలో అన్ని రాష్ట్రాలు ఆదాయం కోల్పోయి కేంద్రప్రభుత్వం మీదే ఆధారపడబోతున్నాయి. అప్పుడు ఇంకా కష్టం అవుతుంది. ఈ కరోనా కంటే చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి.

మే3 తరువాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే దేశంలో కరోనా వైరస్‌ మళ్ళీ విజృంభించడం ఖాయం. కనుక దానిని ఏవిధంగా ఎదుర్కోవాలో ఇప్పుడే ఆలోచించుకొని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది,” అని రాహుల్‌ గాంధీ అన్నారు