ఏప్రిల్ 20వరకు రాష్ట్రంలో 100 శాతం లాక్‌డౌన్‌:కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20 వరకు ఎప్పటిలాగే నూటికి నూరు శాతం లాక్‌డౌన్‌ కొనసాగుతుందని సిఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆ తరువాత కరోనా తీవ్రతను బట్టి జోన్లు వారీగా లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలుచేస్తామని తెలిపారు. 

కేంద్రప్రభుత్వం మే 3వరకు లాక్‌డౌన్‌ పొడిగించి, ఏప్రిల్ 20 నుంచి జోన్లవారీగా లాక్‌డౌన్‌ ఆంక్షలను తగ్గించడానికి మార్గదర్శకాలు ప్రకటించడంతో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సిఎం కేసీఆర్‌ బుదవారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో సహా పలువురు ఉన్నతాధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ఎమన్నారంటే..    

అవసరమైతే ఒకేసారి లక్షమందికి చికిత్స అందించడానికి వీలుగా ఆసుపత్రులు, బెడ్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, వైద్యులు, వైద్య సహాయసిబ్బంది, పీపీఈ కిట్లతో సహా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ చికిత్సతో కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది కనుక ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని సిఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 650 కేసులు నమోదుకాగా వారిలో 118 మంది డిశ్చార్జ్ అయ్యారని, నేడు మరో 128 మంది డిశ్చార్జ్ కాబోతున్నారని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ధరించే రక్షణ దుస్తులు (పీపీఈ కిట్లు)కు కూడా కొరత లేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.25 లక్షల కిట్లు సిద్దంగా ఉన్నాయని, త్వరలో మరో 5 లక్షల కిట్లు రానున్నాయని అవి కాక మరో 5 లక్షల కిట్లకు ఆర్డర్ పెట్టామని సిఎం కేసీఆర్‌ తెలిపారు. 

అలాగే కరోనా వైరస్ వ్యాపించకుండా వైద్యులు, రోగులు ధరించే ఎన్‌-95 మాస్కూలు 3.25 లక్షలు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరో 6.75 లక్షల ఎన్‌-95 మాస్కూలు అందుబాటులోకి వస్తాయని సిఎం కేసీఆర్‌ తెలిపారు.       

కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా లాక్‌డౌన్‌ పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని సిఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసారు.