
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితులలో ప్రజలు ఒకచోట నుంచి మరోచోటికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వాసుల కోసం ఉచిత కారు సేవలను ప్రారంభించింది. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మంగళవారం పచ్చజెండా ఊపి ఈ కారు సర్వీసులను ప్రారంభించారు.
నగర పోలీసుల సౌజన్యంతో మొదలైన ఈ సేవా కార్యక్రమం లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకు 24 గంటలు కొనసాగిస్తామని మహీంద్రా లిమిటెడ్ అధికారి శివాలి బోయిర్ చెప్పారు. నగరంలో మొత్తం 10 కార్లను ఈ సేవలకు అందుబాటులో ఉంచామని చెప్పారు. వీటిని వినియోగించుకొనేవారు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని చెప్పారు. ఈ ఉచిత సర్వీసులను వినియోగించుకొనేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 100 లేదా 84339 58158 నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.
ఈ ఉచిత సేవలు ఎవరి కోసమంటే...
సీనియర్ సిటిజన్లు, సింగిల్ మదర్స్, దివ్యాంగులు నిత్యావసర వస్తువులు, మందులు కొనుగోలు చేసేందుకు, ఆస్పత్రులకు వెళ్ళేందుకు, ఇంకా బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లేందుకు ఉపయోగించుకోవచ్చు.
వైద్యుల అపాయింట్‌మెంట్ ఉన్నవారు, గుండె సంబంధిత, చిన్నారుల టీకాలు వేయించేందుకు ఈ ఉచిత కారు సేవలను వినియోగించుకోవచ్చు.
అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మందులు, ఆహారం అందజేస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు వీటిని వినియోగించుకోవచ్చు.
వీరికి ఈ ఉచిత సేవలు లభించవు:
కరోనా లక్షణాలున్నవారికీ, కరోనా రోగులకు ఈ సేవలు లభించవు.
గుండెపోటు, ఫ్రాక్చర్స్ అయినవాళ్ళకు, తక్షణ వైద్యసేవలు అవసరమైన వారికివి అందుబాటులో ఉండవు.
గర్భవతులకు, సాధారణ వైద్య సేవలకు వెళుతున్నవారికి ఈ ఉచిత సేవలు లభించవు.