
ఈనెల 14తో ముగియబోతున్న 3వారాల లాక్‌డౌన్‌ను మరో రెండు మూడు వారాలు పొడిగించాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వస్తున్న వార్తలపై మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“ఎటువంటి ముందస్తు ఏర్పాటు చేయకుండా ప్రకటించిన 3 వారాల లాక్‌డౌన్ వలన అనేకమంది కార్మికులు, వలసలు వచ్చినవారు చాలా బాధలు పడుతున్నారు. ఒకవేళ మీరు లాక్‌డౌన్ పొడిగించాలనుకొంటే కార్మికులందరికీ ఒక్కొక్కరికీ రూ.5,000 చొప్పున లభించేలా చేయండి. ఆకలితో అలమటిస్తున్న వారందరికీ ఆహారం అందించేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారపు నిలువలు ఏర్పాటు చేయండి. రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించండి. ఆర్ధికవ్యవస్థ రెండవ ప్రాధాన్యం కనుక ముందు ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టండి,” అని ట్వీట్ చేశారు.
సూరత్‌లో వలస కార్మికులు తమకు జీతాలు చెల్లించాలని, తమను స్వస్థలలకు పంపించాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న ఓ వీడియోను మహేశ్ లంగ అనే ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దానిని అసదుద్దీన్ ఓవైసీ తన ట్వీట్‌కు జతచేశారు.