
ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఇళ్ళలో నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కూలు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మొదలు గ్రామీణప్రాంతాలలో పనిచేసే ఉద్యోగుల వరకు అందరూ తప్పనిసరిగా మాస్కూలు ధరించాలని ఆదేశించింది. ఇంట్లో తయారుచేసుకొన్న మస్కులను కూడా ధరించవచ్చని పేర్కొంది. కానీ మాస్కులు ధరించకుండా ఎవరూ బయటకు రావడానికి వీలులేదని స్పష్టం చేసింది.
కరోనా సోకిన రోగి మాట్లాడుతున్నప్పుడు అతను లేదా ఆమె నోటి నుంచి వెలువడే తుంపర్లు ఎదుటవ్యక్తులపై పడి వైరస్ వ్యాపిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే బయట తిరుగుతున్నవారిలో ఎవరికి కరోనా సోకిందో... గుర్తించలేము కనుక అందరూ స్వీయ రక్షణ కోసం మాస్కులు ధరించక తప్పదు. కానీ ప్రస్తుతం మార్కెట్లో మాస్కులకు డిమాండ్ పెరగడంతో ఇప్పుడు మెడికల్ షాపులలో అవి కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా ఎంఆర్పీ కంటే చాలా ఎక్కువధర వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కనుక ప్రజలు ఇళ్లలోనే సొంతంగా మాస్కులు తయారుచేసుకొని ఉపయోగించుకోవచ్చు.