తెలంగాణ లాక్‌డౌన్‌... మార్గదర్శకాలు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. లాక్ డౌన్‌ సమయంలో అందించే సేవలు, పాటించవలసిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. 

1. తెల్లరేషన్ కార్డు ఉన్నవారి కుటుంబంలో ఒక్కొక్కరికీ 12 కేజీలు చొప్పున బియ్యం, కుటుంబంలో అందరికీ కలిపి రూ.1,500 నగదు ఇవ్వబడుతుంది. 

2. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రైవేట్, కాంట్రాక్ట్ కార్మికులందరికీ వారివారి సంస్థలు పూర్తి వేతనాలు చెల్లించవలసి ఉంటుంది. 

3. ప్రభుత్వోద్యోగులలో 20 శాతం మంది చొప్పున రొటేషన్ పద్దతిలో పనిచేయాలి. 

4. నిత్యావసర వస్తువులు తెచ్చుకొనేందుకు బయటకు వెళ్ళవచ్చు కానీ ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తిని మాత్రమే అనుమతిస్తారు. ఒకసారి బయటకు వచ్చినప్పుడు రెండు మూడు రోజులకు సరిపడా అవసరమైన అన్ని వస్తువులన్నీ కొనుగోలుచేసుకోవలసి ఉంటుంది.  

5. ఎక్కడా జనాలు గుమిగూడరాదు. బయటకు వచ్చినప్పుడు, తిరిగి ఇంటికి చేరుకొన్నాక తప్పనిసరిగా వైద్యులు సూచిస్తున్న అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలి. బయటకు వచ్చినప్పుడు ఇతరులతో కనీసం 1-2 మీటర్ల దూరం పాటించడం మంచిది.    

6. రాష్ట్ర సరిహద్దులను మూసివేయబడతాయి కనుక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను అనుమతించబడవు. అయితే నిత్యావసర సరుకుల రవాణా వాహనాలు అనుమతించబడతాయి. 

7. రాష్ట్రంలో ఐ‌టి కంపెనీల ఉద్యోగులందరూ ఇళ్ళ నుంచే పనిచేసుకొనేందుకు అనుమతిస్తారు. 

8. అన్ని రకాల నిర్మాణపనులు నిలిపివేయాలి. 

రాష్ట్రంలో తెరిచి ఉండేవి:              

ఆసుపత్రులు, మందుల షాపులు, పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాలు, కూరగాయల దుకాణాలు, గ్యాస్ సరఫరా సంస్థలు. (కిరాణా, కూరగాయల దుకాణాలను పరిమిత సమయంలో అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది.)  

రాష్ట్రంలో మూసివేయబడేవి:

షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, పార్కులు, కోచింగ్ సెంటర్లు, ప్రార్ధనా స్థలాలు, పర్యాటక కేంద్రాలు, జాతీయ, అంతర్జాతీయ విమాన సేవలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటిఎస్ రైళ్లు, రైతుబజార్లు ఇంకా జనం గూమిగూడే అవకాశాలున్న ప్రదేశాలన్నీ.    

మార్చి 31వ తేదీవరకు ఈ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి.