
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఈనెల 31వరకు జనతా కర్ఫ్యూను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ టాక్సీలు, ఆటోలు వగైరా అన్నిటినీ నిలిపివేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. నిన్న జనతా కర్ఫ్యూ పాటించినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఏవిధంగా తమ ఇళ్లలోనే ఉండిపోయారో అదేవిధంగా మార్చి 31వరకు కూడా ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వానికి తోడ్పడాలని సిఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు అన్ని రోజులు ఇంట్లో కూర్చోంటే పస్తులుండవలసి వస్తుంది కనుక, రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులు ఉన్నవారందరికీ, కుటుంబంలో ఒక్కొక్కరికీ 12 కేజీలు చొప్పున బియ్యం ఇస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు రూ.1,500 నగదు కూడా ఇస్తామని తెలిపారు.
రాష్ట్రంలో మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఒక్కో ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటకు వెళ్ళేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. అయితే బయటకు వెళ్లినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ లక్షణాలున్నవారు తప్పనిసరిగా 104కు ఫోన్ చేసి తెలియజేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, 14 రోజులపాటు తప్పనిసరిగా గృహనిర్బంధంలో ఉండాలని సిఎం కేసీఆర్ కోరారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా కరోనా లక్షణాలున్నవారు బయట తిరుగుతున్నట్లు గుర్తిస్తే అది నేరంగా పరిగణించబడుతుందని, అటువంటివారిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకొంటారని సిఎం కేసీఆర్ హెచ్చరించారు. దీనికి సంబందించి మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రజాహితం కోసం చేపడుతున్న ఈ చర్యలకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.