5.jpg)
దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరుగున్న కారణంగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. నేటి నుంచి ఈ నెల 31వరకు దేశవ్యాప్తంగా 75 జిల్లాలలో పూర్తిగా లాక్-డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం లాక్ డౌన్ కానున్నాయి. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, ప్రకాశం జిల్లాలు లాక్ డౌన్ జాబితాలో ఉన్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆ జిల్లాలు మాత్రమే కాకుండా మొత్తం అన్ని జిల్లాలను ఈనెల 31 వరకు లాక్ డౌన్ చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఇంతకు మించి వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. దీని వలన ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఈ నెల 31వరకు రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులను మూసివేస్తారు. అత్యవసర సేవలు, నిత్యావసర సరుకులను తెచ్చే వాహనాలను తప్ప మరే వాహనాలను రాష్ట్రాలలోకి అనుమతించరు. సినిమా హల్స్, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, హోటల్స్, దుకాణాలు, కోచింగ్ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలలు, పార్కులు, పర్యాటక స్థలాలు, ప్రార్ధనా స్థలాలు అన్నీ మూసివేయబడతాయి. అయితే అత్యవసరసేవలు అందించేవారికి, మీడియాకు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈనెల 31వరకు దేశవ్యాప్తం అన్ని రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సులు, జాతీయ, అంతర్జాతీయ విమానసేవలు రద్దు చేయబడ్డాయి.