రేవంత్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గండిపేటలోగల మంత్రి కేటీఆర్‌ ఫాంహౌసును అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినందుకు నార్సింగ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా, మియాపూర్ కోర్టు ఆయనకు 2 వారాలు రిమాండ్ విధించింది. బెయిల్‌ కోసం రేవంత్‌ రెడ్డి పెట్టుకొన్న పిటిషన్‌ను మియాపూర్ కోర్టు తిరస్కరించడంతో పార్లమెంటు సమావేశాలలో పాల్గొనేందుకు తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు నేడు బెయిల్‌పై మంజూరు చేసింది. అయితే ఈ కేసులో బెయిల్‌ పొందినప్పటికీ, ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వేగవంతం అయినందున మళ్ళీ ఆ కేసులో రేవంత్‌ రెడ్డికి ఇటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఓటుకు నోటు కేసుపై మంగళవారం విచారణ జరిగింది. తదుపరి విచారణ వచ్చే నెల 20కి వాయిదా పడింది.