
సీఏఏను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేయించిన సిఎం కేసీఆర్ దేశద్రోహి అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బిజెపి నేతలు ఆరోపించడంపై టిఆర్ఎస్ సీనియర్ నేత, మండలి విప్ కర్నె ప్రభాకర్ చాలా ఘాటుగా బదులిచ్చారు.
మంగళవారం టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో అన్ని కులమతాల ప్రజలను సమానంగా ఆదరిస్తున్న సిఎం కేసీఆర్ అసలు సిసలైన లౌకికవాది. కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మద్య సీఏఏ పేరుతో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్రమోడీయే దేశద్రోహి. ప్రజల మద్య చిచ్చు పెట్టాలని బిజెపి ప్రయత్నిస్తే మేము చూస్తూ ఊరుకోబోము. అవసరమైతే సీఏఏకు వ్యతిరేకంగా సిఎం కేసీఆర్ నాయకత్వంలో జాతీయస్థాయిలో ఉద్యమం ప్రారంభిస్తాము. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా ఎంపికైన బండి సంజయ్ కుమార్ సిఎం అవగాహనారాహిత్యంతో సిఎం కేసీఆర్ పట్ల చులకనగా మాట్లాడి రెండు రోజులలోనే ప్రజలలో చులకనయ్యారు. ఇకనైనా ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది,” అని హెచ్చరించారు.