పంట రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ

తెలంగాణ ప్రభుత్వం పంట రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు... 

1. 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2018 డిసెంబర్ 11లోపు రెన్యూవల్ పంట రుణాలు, వడ్డీలు కూడా కలుపుకొని  లక్ష రూపాయలు లేదా అంతకంటే తక్కువ రుణం తీసుకొన్న రైతులకు ఇది వర్తిస్తుంది. 

2. గ్రామీణ ప్రాంతాలలో బంగారం తాకట్టు పెట్టి లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకొన్నవారికి ఇది వర్తిస్తుంది. 

3. ఒక రైతు కుటుంబం వేర్వేరు బ్యాంకులలో రుణాలు తీసుకొన్నట్లయితే కేవలం లక్ష రూపాయల వరకు రుణం మాఫీ చేయబడుతుంది. 

4. ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది దీనికి అర్హులైతే అందరికీ కలిపి లక్ష రూపాయలను సమానంగా మాఫీ చేస్తారు.  

5. ఉద్యానవన పంటల కోసం స్వల్పకాలిక రుణాలు అంటే 18 నెలల కాలవ్యవది కలిగినవాటికి కూడా ఇది వర్తిస్తుంది. 

6. ఎంఈవో, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శిల సాయంతో తహశీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయాధికారి అర్హులైన రైతులను గుర్తిస్తారు.      

పంటరుణాల మాఫీ ఈ రుణాలకు వర్తించదు:  

రీషెడ్యూల్‌ చేసిన రుణాలు, రీస్ట్రక్చర్డ్‌ రుణాలు, వ్రాతపూర్వక రుణాలు, తొలగించిన ఖాతాలకు, టై అప్‌ రుణాలు, జేఎల్జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీ రుణాలు. 

రూ.25,000 రుణాలను ఒకేసారి మాఫీ చేస్తారు. లక్ష రూపాయల వరకు రుణాలను నాలుగు వాయిదాలలో మాఫీ చేస్తారు. ఎంపిక చేసిన అర్హులైన రైతులకు చెక్కుల రూపంలో రుణమాఫీ సొమ్మును నేరుగా అందించనున్నారు.