నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికలలో కవిత పోటీ

మాజీ ఎంపీ కవిత నిజామాబాద్‌ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయబోతున్నారు. మంగళవారం సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కవితను మండలికి పంపించాలనే ప్రతిపాదనపై పార్టీ నేతలందరూ ఏకగ్రీవంగా సమర్ధించారు. కనుక నేడు ఆమె నామినేషన్ వేయనున్నారు. మరికొద్ది సేపటిలో దీనిపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 స్థానిక సంస్థల కోటాలో జరుగబోయే ఈ ఎన్నికలలో కవిత గెలుపు లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు. ఎందుకంటే, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు వేయబోయే స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో 95 శాతం మంది తెరాసకు చెందినవారే ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేసిన మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్ రావు కవితకు మద్దతుగా నేడు నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు. 

2014 లోక్‌సభ ఎన్నికలలో నిజామాబాద్‌ నుంచి పోటీ చేసి గెలిచిన కవిత 2019లో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సిఎం కేసీఆర్ ఆమెను కే. కేశవరావు స్థానంలో రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ మళ్ళీ కేశవరావుకే అవకాశం కల్పించడంతో కవితకు ఏ పదవీబాధ్యతలు అప్పగిస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్న సమయంలో సిఎం కేసీఆర్ ఆమెను శాసనమండలికి పంపించాలని నిర్ణయించారు. ఆమె జనవరి 2022 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. నిజామాబాద్‌ నుంచి టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడిన కారణంగా ఇప్పుడు ఆ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.