పేదప్రజల కోసం విజయశాంతి ఆవేదన

కరోనా మహమ్మారి భారతదేశంలోకి కూడా ప్రవేశించి అన్ని వ్యవస్థలు, అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని వలన రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ప్రజలు అందరికంటే ఎక్కువగా నష్టపోతున్నారు. కరోనా వైరస్‌ భయంతో వారు ఇళ్లలో కూర్చోంటే కుటుంబం పస్తులు ఉండవలసి వస్తుంది. కనుక తప్పనిసరిగా జనసమూహాలు ఉండే బహిరంగ ప్రదేశాలకు వెళ్ళవలసివస్తోంది. తద్వారా వారికి కరోనాకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వారు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై కాంగ్రెస్‌ మహిళా నేత విజయశాంతి తనదైన శైలిలో స్పందిస్తూ, “              ప్రపంచమంతా నానాటికీ పేద, ధనిక వ్యవస్థలుగా మారిపోతూ... హాస్పిటల్స్ అన్నీ కార్పోరేట్ ధోరణితో సామాన్యులపై కూడా వసూళ్ళ పడగ విప్పి... పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్న పరిణామాలు సర్వసాధారణమైపోయాయి. ఇప్పుడు ప్రకృతి సైతం ఆగ్రహించిందా? అన్నట్టు కరోనా పంజా విసిరింది. ఇది జీవనాధార అవసర దృష్ట్యా, నిత్యం ప్రజలతో కలసి పనిచేయాల్సిన పరిస్థితులలో... క్వారంటైన్ అవలంబించలేని మధ్యతరగతి, పేద వర్గాలను మరింత కుంగదీస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు అన్ని వర్గాలకూ సమానంగా చికిత్స అందేలా... ప్రజల భద్రత కోసం సరైన తీరులో జాగ్రత్తలు వహిస్తాయని ఆశిస్తున్నాను. ప్రజలు కూడా వదంతులతో భయాందోళనలకు గురికాకుండా అవసరమైన జాగ్రత్తలన్నీ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ దైవం ప్రతి ఒక్కరినీ తన పిల్లలుగా దీవించి, ఏ చిన్న కష్టానికీ గురికాకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...మీ విజయశాంతి,” అని తన ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టారు.